రేవంత్ రెడ్డి.. ఏడాదికో పార్టీ మారే బతుకు నీది - మంత్రి ఎర్రబెల్లి
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఏడాదికో పార్టీ మారే బతుకని ఆయనదని విమర్శించారు. పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్.. ఇతర పార్టీలను విమర్శించేందుకు సిగ్గుండాలని ఎర్రబెల్లి అన్నారు. ఆయనలాగా తమకు రోత మాటలు రావని, తిమ్మిని బమ్మి చేయడం తెలియదని అన్నారు.
కొడంగల్ లో చిత్తుగా ఓడిన రేవంత్ బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నడని, ఆయనకు దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసి గెలవాలని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు. వాస్తవానికి రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందని, పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందని ఎర్రబెల్లి అన్నారు. 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఆ గ్రాఫ్ మరింత పడిపోతుందని చెప్పారు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, పక్క రాష్ట్రాల్లో ఇవ్వని 6 గ్యారెంటీలు తెలంగాణలో ఇస్తామంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
సీనియర్ నేత పొన్నాలపై రేవంత్ చేసిన కామెంట్లను ఎర్రబెల్లి తప్పుబట్టారు. 40ఏండ్లకుపైగా కాంగ్రెస్ కు సేవ చేసిన వ్యక్తిని రేవంత్ నీచమైన మాటలు అనడాన్ని తీవ్రంగా ఖండించారు. మంత్రి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శించే అర్హత రేవంత్ కు లేదని అన్నారు. కేసీఆర్ దయతో జనగామ జిల్లా అయిందని, దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.