కార్యకర్తలను చూసి కంటతడి పెట్టుకున్న ఎర్రబెల్లి
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి యశస్వని రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా ఎన్నికల అనంతరం తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన దయాకర్ రావు.. స్థానిక కార్యకర్తలు, ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారందరినీ చూసిన దయాకర్ రావు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఆయనను చూసిన పలువురు కార్యకర్తులు కూడా కంటతడిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన దయాకర్ రావు.. ఏడాదిలోపు ఏమైనా జరగొచ్చన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఎవరూ ఓపికను కోల్పోవద్దని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. పాలకుర్తిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, ఎల్లప్పుడూ అందరికీ అండగా ఉంటానని మాటిచ్చారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న పదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన యశస్విని రెడ్డికి శుఖాకాంక్షలు తెలిపిన ఆయన.. పార్టీకి ఏ కష్టమొచ్చినా తోడుంటానని భరోసానిచ్చారు.