జహీరాబాద్ టికెట్ రేసులో ఎర్రోళ్ల ముందంజ!
X
సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తం చూసుకుని జాబితా విడుదల చేస్తారని చెబుతున్నారు. దాదాపు 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చని భావిస్తున్నారు. పనితీరు బాలేకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత, గెలిచే అవకాశాలు లేకపోవడం, మిగతావారికి అవకాశాలు ఇవ్వాల్సిన అగత్యం తదితర కోణాల్లో కొంతమంది సిట్టంగుల ఆశలు గల్లంతు కానున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక వర్గం అభ్యర్థిని మార్చే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు పనితీరు బాలేదని కేసీఆర్ జరిపించిన సర్వేలో తేలిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్‌పై గురిపెట్టిన కేసీఆర్ ఏ స్థానంలో ఓడిపోకూడదని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే చిన్నపాటి అనుమానాలున్నా అభ్యర్థులకు నో చెబుతున్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించిన జహీరాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఆనాటి ప్రాభవం తగ్గి ప్రతిసారి రెండో స్థానంతో సరిపెట్టుకుంటోంది. కాంగ్రెస్ ఈసారి అమీతుమీ పోరాటానికి దిగుతుండడంతో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్నది కేసీఆర్ ఆలోచన.
తెలంగాణ ఉద్యమంలో తనతో కలసి పనిచేసిన యువనేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వైపు దళపతి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 2018లోనే శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వాల్సి ఉండిందని, అనివార్య కారణాల వల్ల మాణిక్ రావుకు దక్కిందని చెబుతున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఐడీసీ) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. అంతకు ముందు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ హోదాలో తనకున్న పరిమిత అధికారాల మేరకు బడుగువర్గాలకు న్యాయం చేయడానికి చక్కగానే పనిచేశారని కేసీఆర్ అభిప్రాయం. అన్యాయానికి గురైన దళితుల దగ్గరికి నేరుగా వెళ్లి సమస్యలు పరిష్కరించడం, పరిహారం అందజేయడం నచ్చడంతో విశ్వాసంలోకి తీసుకుని తరచూ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
సిద్దిపేట జిల్లా ఘణపూర్‌కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ మంత్రి హరీశ్ రావుకు, కేసీఆర్‌కు సన్నిహితుడు. పార్టీలో చురుగ్గా ఉన్న శ్రీనివాస్ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. జహీరాబాద్ టికెట్ ఆయనకు ఇస్తే కచ్చితంగా గెలుస్తారని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందరినీ కలుపుకుపోయే తత్వం, ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తుశుద్ధి ఆయనకు కలిసివచ్చే అంశాలు. అధిష్టానం సంకేతాలతోనే ఆయన నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని సమాచారం. దీంతో మాణిక్ రావు అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలసి పనిచేసిన బాల్క సుమన్, రసమయి బాలకిషన్ తదితరులకు అవకాశం ఇచ్చినట్లే ఎర్రోళ్లకు కూడా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. నాన్ లోకల్ కావడం ఆయన ప్రతికూల అంశమే అయినా అధిష్టాన అండ ఉండడంతో ముందుకు వెళ్తున్నారు.