నయీంకే భయపడలేదు.. ఈ బెదిరింపులు ఎంత..? - ఈటల
X
తన హత్యకు కుట్రపన్నుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఈటల రాజేందర్ స్పందించారు. కొందరు తనను జాగ్రత్తగా ఉండాలని కొన్ని నెలలుగా బెదిరిస్తున్నారని అన్నారు. గ్యాంగ్స్టర్ నయీంకే భయపడని తాను ఈ బెదిరింపులకు భయపడతానా అని చెప్పారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతుందని ఈటల స్పష్టం చేశారు.
గెలుపు బీజేపీదే
బీజేపీ నేతలతో ఫొటో దిగితే బీసీ బంధు, దళితబంధు, ప్రభుత్వ పథకాలు అందవని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని ఈటల చెప్పారు. సంక్షేమ పథకాలు పొందలేమన్న భయంతో బయటకు చెప్పకపోయినా.. కేసీఆర్ ను మళ్లీ గెలిపిస్తే తమ బతుకులు ఆగమవుతాయని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎదర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తన తప్పులు బయటపడతాయన్న ఉద్దేశంతోనే సెక్రటేరియెట్ లోకి ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఈటల విమర్శించారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందన్న ఆయన.. తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.
ఈజీగా పార్టీలు మారలేను
బీజేపీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బట్టలు మార్చినంత ఈజీగా తాను పార్టీలు మారలేమని స్పష్టం చేశారు. అభిప్రాయభేదాలనేవి అన్ని పార్టీల్లో సహజమని ఈటల అన్నారు. బీజేపీ హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లాన్న ఆయన.. పార్టీ పెద్దలకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. బీఆర్ఎస్ తనను వెళ్లగొడితే.. బీజేపీ అక్కున చేర్చుకుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనను బయటకు పంపినప్పుడు కేసీఆర్ కుటుంబీకులు బాధపడి ఉంటారని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి నుంచి బలంగా
తెలంగాణలో విజయ తీరాలను ముద్దాడేది బీజేపీనేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ చాపకింద నీరులాగా పని చేసుకుంటూ వెళ్తోందని అన్నారు. 9 ఏండ్లలో పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. పొలిటికల్ గ్రాఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదని, తగ్గుతూ, పెరుగుతూ ఉంటుందని అన్నారు. కింది స్థాయి నుంచి బలంగా ఉంటేనే పార్టీ ఎదుగుతుందన్న ఈటల.. బీజేపీ క్షేత్రస్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
telangana,shamerpet,etala rajender,bjp,party highcommand,bjp leaders,assembly election,congress,party change,political graph,bjp political strategy