Home > తెలంగాణ > ఢిల్లీలో ఈటల, రాజగోపాల్ మకాం.. ఆయనతో భేటీ కోసమేనా..?

ఢిల్లీలో ఈటల, రాజగోపాల్ మకాం.. ఆయనతో భేటీ కోసమేనా..?

ఢిల్లీలో ఈటల, రాజగోపాల్ మకాం.. ఆయనతో భేటీ కోసమేనా..?
X

తెలంగాణలో మిషన్ 90 నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీకి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ క్యాడర్ డీలా పడింది. ఆ తర్వాత నేతల మధ్య వర్గపోరు ఆ పార్టీకి మరింత తలనొప్పిగా మారింది. తాజాగా పార్టీ మారనున్నారంటూ వార్తలు వస్తుండటంతో ఈటల రాజేందర్తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ తాజాగా బండిని హస్తినకు రావాలని ఆదేశించింది. పార్టీ పెద్దల పిలుపుతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అయితే హైకమాండ్ తో చర్చలు ముగిసినా ఈటల, రాజగోపాల్ ఇంకా ఢిల్లీలోనే మకాం వేయడం ఆసక్తికరంగా మారింది.

బండిపై ఫిర్యాదు

ఇదిలా ఉంటే బీజేపీ నాయకత్వం తెలంగాణ బీజేపీ నేతలతో వరుస చర్చలు జరుపుతోంది. ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలపై హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హస్తినకు పిలిపించిన పెద్దలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో ఇరువురు నేతలు బండి సంజయ్ పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను ఆయన చులకనగా చూస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలతో విజయావకాశాలను దెబ్బ తీస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది.

నడ్డా, షాతో భేటీ

సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఎన్నో అవకాశాలు వస్తున్నా బండి సంజయ్ కు ముందుచూపు లేకపోవడం వల్ల వాటన్నింటినీ కోల్పోవాల్సి వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల.. జేపీ నడ్డాకు చెప్పినట్లు తెలుస్తోంది. బండి వ్యవహారశైలి పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశమున్నందున ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సైతం కలిసి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మారుతామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇరువురు నేతలు పార్టీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం.

ఇంకా ఢిల్లీలోనే మకాం

నిజానికి ఈటల, రాజగోపాల్ రెడ్డితో భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వచ్చారు. అయితే వారిద్దరు మాత్రం తిరిగి రాకుండా ఢిల్లీలోనే ఉండిపోయారు. దీంతో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేతలిద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అందులో భాగంగానే రాష్ట్రానికి తిరిగి రాకుండా హస్తినలోనే ఉండిపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈటల, రాజగోపాల్ రెడ్డి సైతం ఆ పార్టీ పెద్దలతో సమావేశంకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. పొంగులేటి, జూపల్లితో పాటే ఈటల, రాజగోపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.


Updated : 26 Jun 2023 2:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top