కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఉన్న ఇళ్ళను కూడా లాక్కుంటడు.. ఈటల రాజేందర్
X
మళ్ళీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్ళును కూడా లాక్కుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన.. గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చి భూములపై హక్కులు లేకుండా చేశారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా మారారని, సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములని దళితులనుండి దూరం చేసారని అన్నారు. తాను గజ్వేల్‌లోని ఏ గ్రామంలో పర్యటించినా అధికార పార్టీ నేతలు భూములు లాక్కున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్లు కూడా లాక్కుంటారని విమర్శించారు.
కేసీఆర్ ఎట్లా ఓడిపోలేదో నేను కూడా ఒక్కసారి ఓడిపోలేదన్నారు. ఇక నువ్వు గెలిస్తావా? నేను గెలుస్తానా అనేది గజ్వేల్ ప్రజల చేతుల్లో ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లు ఇక్కడ రాకముందే గోదావరిలో మునిగిపోయిందన్నారు. మన డబ్బులన్నీ గోదావరిపాలు చేశారని అన్నారు. "నన్ను పార్టీ నుంచి బయటకు పంపిన తరువాత హరీష్ రావు హుజురాబాద్ వచ్చి కేసీఆర్ అక్రమ సంపాదన 600 కోట్లు ఆరు నెలల పాటు ఖర్చు పెట్టారని తెలిపారు. నా మొఖం అసెంబ్లీలో కనపడవద్దు అని తిరిగారు. కాని మా ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని మండిపడ్డారు. దళితబంధు, బీసీబంధు అన్నీ అబద్ధపు మాటలు. దళితబంధు కేవలం నన్ను ఓడగొట్టడానికి పెట్టారని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతుంటే.. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ఉద్యోగాలని 17 పేపర్లు లీక్ చేశాడు కేసీఆర్" అని మండిపడ్డారు.