భట్టి విక్రమార్కతో జూపల్లి భేటి.. కీలక అంశాలపై చర్చ!!
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు జూపల్లి. అక్కడ దాదాపు గంటపాటు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ ఇద్దరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పాదయాత్ర విజయవంతంపై భట్టికి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్‌లో జరగబోయే బహిరంగ సభకు రావాలని భట్టిని కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అనేక విషయాలు యాత్రలో తెలుసుకున్నట్లు భట్టి చెప్పారన్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా నేతలంతా కలిసి మాట్లాడుకున్నట్లు తెలిపారు. సభకు జాతీయ నేతలు రాబోతున్నారని.. సభను సక్సెస్ చెయ్యాలని చూస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నేతల చేరికలు ఉంటాయన్నారు. కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఆయన కుమారుడు, మేఘా రెడ్డితో పాటు చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఈ నెల 20న కొల్లాపూర్‌లో కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సభలో నాగర్ కర్నూల్ జిల్లాలోని 14 నియోజకవర్గాల నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున జాయిన్ కాబోతున్నారని జూపల్లీ తెలిపారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరిందని, ఈ సభ ద్వారా యావత్ రాష్ట్రానికి ఒక సందేశం చేరబోతుందని పేర్కొన్నారు.
కొల్లాపూర్ లో నిర్వహించబోయే కాంగ్రెస్ బహిరంగ సభకు ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఇదే సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరనున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో నాగర్ కర్నూల్ సభలో జూపల్లి హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు. తన చేరిక గ్రాండ్ గా ఉండేలా జూపల్లి ప్లాన్ చేసుకుంటున్నారు.