కాంగ్రెస్‌లోకి తుమ్మల... రాహుల్ గాంధీ సమక్షంలో చేరిక.?
X
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao ) కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు దిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని, రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, అనుచరులతో తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అనుచరులకు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారని సమాచారం. సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. కుదరకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న తుమ్మల.. పాలేరు నియోజకవర్గ టికెట్ ఆశించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం Khammam నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఆఫర్కు తుమ్మల ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పాలేరు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే పొంగులేటికి హామీ ఇచ్చింది. మరోవైపు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున మంత్రి పువ్వాడ అజయ్ మళ్లీ బరిలో దిగుతున్నారు. ఆయనను ఓడించేందుకు తుమ్మల నాగేశ్వర్ రావు లాంటి సీనియర్ నేతను బరిలో దింపడమే మంచిదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పాలేరు నియోజకవర్గం టికెట్ ఆశించిన తుమ్మలకు బీఆర్ఎస్ అధిష్టానం షాక్ ఇచ్చింది. పాలేరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో తుమ్మల అంసతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత BRS లో చేరారు. 2018 ఎన్నికల్లో కందాల చేతిలో తుమ్మల ఓటమి పాలయ్యారు. దీంతో తుమ్మల తన రాజకీయ భవిష్యత్తుపై కొన్నిరోజులుగా అనుచరులతో చర్చిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో తన భారీ అనుచరుగణంతో బలప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజల కోసమైనా పోటీ చేస్తానని.. తలవంచేది లేదంటూ ప్రకటన సైతం చేశారు. అయితే ఆయన పార్టీ మారతారా?.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే విషయాలపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీఆర్‌ఎస్‌కు ఇంకా తుమ్మల రాజీనామా చేయని సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరికలపై తుమ్మలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు,రేఖానాయక్‌లు సైతం పీసీసీతో మంతనాలు చేస్తున్నారు.