ఇల్లందు నుంచి గుమ్మడి నర్సయ్య కుమార్తె పోటీ
X
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సరయ్య కూతురు ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ ప్రకటించారు. ఉస్మానియా పీజీ లా కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న అనురాధ నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల బారి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో నే ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలసీతారామ ప్రాజెక్ట్, బయ్యారం స్టీల్ ప్లాంట్, యువతకు విద్య, ఉపాధి కల్పనే తన ఎజెండా అని చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అనురాధ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నట్లు ఈ మధ్య ప్రచారం జరిగింది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను సంప్రదించిన మాట నిజమే. కానీ నేను ఏ పార్టీని కలవలేదు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను స్వయంగా గమనించేందుకే పర్యటించాను. ఈ నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు రాజకీయాల్లోకి రావాలని నన్ను స్వాగతించారు. అందుకే నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల నుండి రక్షించాలనే ఉద్దేశంతోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాను’’ అని అనురాధ తెలిపారు. ఇదే క్రమంలో ‘మీ తండ్రి పోటీచేస్తే మీరూ బరిలో నిలుస్తారా?’ అని మీడియా ప్రశ్నించగా తమ మధ్య పోటీ ఉండదని ఆమె సమాధానం ఇచ్చారు. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన తండ్రి స్వాగతించారని స్పష్టం చేశారు.