వచ్చే నెల నుంచే స్కూళ్లలో పేస్ రికగ్నిషన్ అటెండెన్స్
X
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే నెల నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీచర్లకు ట్యాబ్‌ల పంపిణీ పూర్తి కాగా.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ను ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగా, వచ్చేనెల నుంచి ఆధునిక అటెండెన్స్ విధానానాన్ని అమలుచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది.
ఇప్పటి వరకు రిజిస్టర్లలో అటెండెన్స్ వేసేవారు. కరోనా ముందు వరకు బయోమెట్రిక్ హాజరు అమలుచేశారు. ఆ తర్వాత జియో అటెండెన్స్‌ను అమలుచేసినా.. తర్వాత నిలిపివేశారు. తాజాగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలుకు చర్యలు చేపట్టారు. టీచర్లకు అందజేసిన ట్యాబ్/స్మార్ట్‌ఫోన్లల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను ఇన్‌స్టాల్ చేస్తారు.
మొదట విద్యార్థులు / టీచర్ల వ్యక్తిగత చిత్రాలు (ఫొటోలను) యాప్‌లో లోడ్‌చేస్తారు. క్లాస్ టీచర్ స్మార్ట్‌ఫోన్/ ట్యాబ్ కెమెరాను తెరిచి, మొత్తాన్ని స్కాన్ చేయగానే ఎఫ్‌ఆర్‌ఎస్ అప్లికేషన్, కాగ్నిటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి, డాటాబేస్‌లో ఉన్న చిత్రాలో పోల్చుకుంటుంది. ఆయా ముఖాల (చిత్రాల) ఆధారంగా ఆ రోజు క్లాసుకు ఎంత మంది హాజరయ్యారో, ఎంత మంది గైర్హాజరయ్యారో అప్పటికప్పుడే తేల్చేస్తుంది. ఒక విద్యార్థి అవసరమైనంత హాజరుశాతం లేకపోయినా.. తక్కువగా ఉన్నా.. అలర్ట్‌ను జారీచేస్తుంది.