రైతు రుణమాఫీ ప్రక్రియ షురూ.. తొలి రోజు ఎంత మందికి లబ్ది చేకూరిందంటే..?
X
తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ షురువైంది. రుణమాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో గురువారం రూ. 37,000 నుంచి రూ. 41,000 మధ్య అప్పు ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. తొలిరోజు 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు మాఫీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని 2018లో ఇచ్చిన హామీని నెరవేర్చనున్నట్లు చెప్పారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లోనే రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. ఈసారి దాదాపు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. తాజా రుణమాఫీతో దాదాపు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరతుంది.