Miryalaguda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..మృతులంతా ఒక కుటుంబం వారే
X
దైవ దర్శనానికి వెళ్లి సంతోషంగా కారులో వస్తున్నారు. మరికాసేపట్లో అంతా ఇంటికి చేరుకొని హాయిగా నిద్రపోయేవారు. కానీ, అంతలోనే లారీ రూపంలో మృత్యువు కబలించడంతో తిరిగి రానీ లోకాలకు చేరుకున్నారు. ఆదివారం అర్థరాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉండగా..మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్, జ్యోతి, రిషితగా గుర్తించారు. మరో ఇద్దరు మహేశ్ తోడల్లుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్, లియాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండడంతో..ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మోపీదేవి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిరిగితే మూడు, నాలుగు నిమిషాల్లో ఇంటికి వెళ్లే వారని.. ఇంతలో లారీ మృత్యురూపంలో ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు.