Home > తెలంగాణ > బడ్జెట్లో అసమానతలు తొలగించే ప్రయత్నం చేశాం - భట్టి విక్రమార్క

బడ్జెట్లో అసమానతలు తొలగించే ప్రయత్నం చేశాం - భట్టి విక్రమార్క

బడ్జెట్లో అసమానతలు తొలగించే ప్రయత్నం చేశాం - భట్టి విక్రమార్క
X

తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ అనంతరం సమాధానం ఇచ్చిన ఆయన.. తాము ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ద్వారా అసమానతలు తొలగించేందుకు కృషి చేశామని అన్నారు. సామాజిక సమానత్వంలో భాగంగా నిధుల కేటాయింపు జరిపామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 20 శాతం చొప్పున బడ్జెట్ పెంచుకుంటూ పోయారే తప్ప అసమానతలు తగ్గించే ప్రయత్నం చేయలేదని భట్టి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రాజస్థాన్ బడ్జెట్ కన్నా ఎక్కువగా ఖర్చు చేసిందని, గతంలోలాగే 20 శాతం బడ్జెట్ పెంచుకుంటూ పోతే ప్రమాదమని అన్నారు. రాష్ట్రంపై మొత్తం 7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందని సభకు వివరించారు. బడ్జెట్, బడ్జెటేతర రుణాలను ఎఫ్ఆర్బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని భట్టి చెప్పారు.

బీఆర్ఎస్ నేతలు మాట్లాడేవన్నీ అబద్దాలేనని భట్టి అన్నారు. గతంలో ఆ అబద్దాలతోనే బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవ అంకెలతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని చెప్పారు. అసమానతలు తొలగించడంతో పాటు కేటాయింపుల్లో సమన్యాయం చేశామని భట్టి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేటాయింపులు ఎక్కువ చేసి ఖర్చు మాత్రం తక్కువ పెట్టింని, కానీ తాము మాత్రం బడ్జెట్లో కేటాయించిన ప్రతి పైసాను ఆయా శాఖలకే ఖర్చు చేస్తామని చెప్పారు.

తెలంగాణ వచ్చాక బతుకులు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారని కానీ అలా జరగలేదని భట్టి అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేదని విమర్శించారు. దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. ఆదాయం లేకుండా ఖర్చులు పెడితే సమస్యలు వస్తాయని ఆ విషయం మరిచిపోయి గత ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. తెచ్చిన అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేసిందని భట్టి ఫైర్ అయ్యారు.

ఆరు గ్యారెంటీలకు లెక్క ప్రకారమే నిధులు ఇస్తున్నామని భట్టి స్పష్టం చేశారు. ఉన్నదాంట్లో అన్నింటికీ సర్దుకుపోయేలా ప్లాన్ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని విమర్శించారు. తాము పాలనాపగ్గాలు చేపట్టిన వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టామని, సింగరేణి, వైద్య, పోలీసు శాఖల్లో ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశామని చెప్పారు. 69 రోజుల్లో మొత్తంగా 23,147 ఉద్యోగాలు భర్తీ చేశామని భట్టి ప్రకటించారు.




Updated : 15 Feb 2024 11:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top