కేకే కుమారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు
X
బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఇద్దరు కుమారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని ఎన్బీటీనగర్ సర్వే నంబరు 129లోని 939 గజాల స్థలాన్ని బంజారాహిల్స్‌కు చెందిన పి.సుదర్శన్‌రెడ్డి 470 గజాలు, బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లో నివసించే జయమాల 469 గజాల స్థలాన్ని 1983లో షేక్ అలీఖాన్ అహ్మద్ నుంచి కొనుగోలు చేశారు. సుదర్శన్ రెడ్డి దక్షిణం, జయమాల ఉత్తరం వైపు భాగాలు తీసుకున్నారు. అనంతరం జయమాల అమెరికాలో సెటిల్ అయ్యారు.
గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబరు 13లోని జయమాల ఇంటికి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసు జారీ చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,13,67,500లకు స్థలాన్ని విక్రయించారని, పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి చెల్లించాల్సిన పన్ను, పెనాల్టీతో కలిపి రూ.1,40,41,300 చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న జయమాల కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. 2019లో ఎంపీ కె.కేశవరావు కుమారుడు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ విప్లవ్‌కుమార్‌కు స్థలంపై అధికార హక్కులతో కూడిన ఫేక్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ రూపొందించినట్లు జయమాల గమనించారు. జులై 19, 2013లో ఆ స్థలాన్ని తన సోదరుడైన కె.వెంకటేశ్వర్‌రావు అలియాస్ వెంకట్‌కు రూ.3 లక్షలకు విక్రయించినట్లు రిజిస్టర్ డాక్యుమెంట్లను ఆమె గుర్తించారు.
డాక్యుమెంట్లు పరిశీలించిన జయమాల తన సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇటీవలే ఆమె థర్డ్ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో గత నెల 13న పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కె.కేశవరావు కుమారులు విప్లవ్‌కుమార్ ఎ-1, వెంకటేశ్వర్ రావును ఎ-2గా చేర్చారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.