Hyderabad: హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
X
హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తు ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపిస్తుండటంతో బిల్డింగ్ లో చిక్కుకున్న డాక్టర్లు, పేషెంట్లు, వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంతో.. ఆసుపత్రి ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో రోగులు, అక్కడున్న జనం భయాందోళనతో పరుగులు తీశారు. రోగులను, వారి కుటుంబసభ్యులను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హాస్పిటల్ మొదటి అంతస్తులో ల్యాబ్ లో మంటలు చెలరేగాయని కొందరు చెబుతున్నారు.
మైక్రోబయాలజీ ల్యాబ్‌లోని ఫ్రిజ్ వద్ద విద్యుదాఘాతంతో స్వల్పంగా మంటలు వచ్చాయని, వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆర్పివేశారని సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. పొగ ఎక్కువగా వ్యాపించడంతో రోగుల సహాయకులు ఆందోళనకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.