మరికాసేపట్లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్న సీఎం
X
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ జోరు పెంచింది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇవాళ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకోనున్న కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు. ముందుగా చెప్పినట్లుగానే సిట్టింగులకే ఈసారి టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అంతర్గత సర్వేల్లో కనీసం పాస్ మార్కులు కూడా రాని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి పక్కనబెట్టినట్లు సమాచారం.
శ్రావణ సోమవారం మంచి రోజు కావడంతో కేసీఆర్ తొలి విడత 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్టులో 96 మంది పేర్లు మాత్రమే ఉంటాయని తొలుత వార్తలు వచ్చినా 105 మంది పేర్లు అనౌన్స్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈసారి 10 మంది సిట్టింగులను సీఎం కేసీఆర్ పక్కనబెట్టినట్లు సమాచారం. నియోజకవర్గాలవారీగా సర్వే రిపోర్టు, స్థానిక నేతల అభిప్రాయాల మేరకు వారికి ఈసారి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టికెట్ రాని సిట్టింగులు, ఆశించి భంగపడ్డ అసంతృప్తులను ఇప్పటికే బుజ్జగించినట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్ దక్కనివారికి ఎమ్మెల్సీ, ఎంపీ లేదా కార్పొరేషన్ పదవులు ఇస్తానని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ నిరాకరించిన 10 మంది సిట్టింగ్ లలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన వారు ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.