Home > తెలంగాణ > ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్.. 31 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ..

ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్.. 31 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ..

ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్.. 31 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ..
X

టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించి ఫ‌స్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తైంది. ఫ‌స్ట్ ఫేజ్‌లో 85.48 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. 3 యూనివ‌ర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండ‌గా, ఫ‌స్ట్ ఫేజ్‌లో 70,665 సీట్లు భ‌ర్తీ అయ్యాయి.మరో 12,001 సీట్లు మిగిలి ఉన్న‌ట్లు అధికారులు ప్రకటించారు. యూనివ‌ర్సిటీల్లో సీట్లలో 85.12 శాతం, ప్రైవేటు యూనివ‌ర్సిటీల్లో 75.08 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 85.71 శాతం నిండాయి.

కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. ఆయా ట్రేడ్ లలో 94.20 శాతం సీట్లు ఫిల్ కాగా.. ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, ఇత‌ర ఇంజినీరింగ్ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ముఖ్యంగా

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, కంప్యూట‌ర్ ఇంజినీరింగ్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టం, ఐవోటీ అండ్ సైబ‌ర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్, ఇంజినీరింగ్ నెట్‌వ‌ర్క్స్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో 100 శాతం సీట్లు నిండాయి. ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్ ఇంజినీరింగ్.. ఈఈఈలో కేవ‌లం 58.38 శాతం సీట్లు మాత్ర‌మే భ‌ర్తీ కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డ‌ర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో నిర్దేశించిన ఫీజును క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం సీటు క‌న్ఫ‌ర్మేష‌న్ అవుతుంది. ఈ నెల 22లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు చెప్పారు. ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసిన అనంతరం విద్యార్థులు ఆగ‌స్టు 9 నుంచి 11 మధ్య తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలి.




Updated : 16 July 2023 3:16 PM IST
Tags:    
Next Story
Share it
Top