ప్రారంభమైన చేప మందు పంపిణీ.. జనంతో కిక్కిరిసిపోయిన క్యూలైన్లు
X
ఆస్తమాతో బాధితులకు ఉపశమనం కలిగించే చేప మందు పంపిణీ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు చేప మందు పంపిణీ కొనసాగనుంది. అనంతరం బత్తిన వంశస్థుల ఇంట్లో రెండు రోజుల పాటు చేప ప్రసాదం ఇవ్వనున్నారు. చేప ప్రసాదం కోసం ఇప్పటికే భారీగా జనం క్యూలైన్లలో నిలబడ్డారు. పొరుగురాష్ట్రాలైన ఏపీ, కర్నాటకతో పాటు తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి.
32 కౌంటర్లు
చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తోంది. చేప ప్రసాదం పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. భారీ సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశమున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2లక్షలకుపైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచారు.
మూడేండ్ల తర్వాత
కరోనా కారణంగా మూడేండ్లుగా చేప ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. దీంతో ఈసారి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రెండు లక్షల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చేప మందులో ఆస్తమాను తగ్గించే ఆయుర్వేద గుణాలు ఉన్నాయని అది తీసుకున్న తర్వాత ఉబ్బసం తగ్గిందని చాలామంది చెబుతున్నారు. ఈ నమ్మకంతోనే చేప మందు తీసుకునేందుకు భారీగా ప్రజలు తరలివస్తారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
చేప మందు పంపిణీ దృష్ట్యా ప్రయాణికుల కోసం ఆర్టీసీ 9, 10వ తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు తదితర ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులు ఏర్పాటుచేసింది. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు 80 బస్సులు నడుపుతున్నారు. మరోవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి వరకు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.