E Challan : వాహనదారులకు మిగిలింది ఐదు రోజులే.. గుర్తుచేసిన ట్రాఫిక్ సీపీ
X
చలాన్లపై మరోసారి రాయితీనిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఆఫర్ ప్రకటించక ముందు పోలీస్ రికార్డ్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లకు రాయితీ కల్పించింది. బైక్స్, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 26 నుంచి ఈ 11 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 76.79 లక్షల చలాన్లకు గానూ.. రూ.66.77 కోట్ల చలాన్ల చెల్లింపులు జరిగాయి.
అయితే ప్రస్తుతం డిస్కౌంట్ తేదీ దగ్గర పడింది. మరో ఐదు రోజులు అంటే జనవరి 10వ తేదీ వరకే డిస్కౌంట్ తో చలాన్లు కట్టుకునే అవకాశం ఉందని ట్రాఫిక్ అదనపు సీపీ ఎం. విశ్వప్రసాద్ తెలిపారు. దీన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకుని సకాలంలో చలాన్లు చెల్లించాలని సూచించారు. కాగా ప్రభుత్వం చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించగానే.. సైబర్ నేరగాళ్లు వీటిపై పడ్డారు. నకిలీ యాప్ సృష్టించి నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన విశ్వప్రసాద్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చూసుకుని చలాన్లు కట్టాలని చెప్పారు. చలాన్ల చెల్లింపులో ఎలాంటి సందేహాలు ఎదురైనా.. 040-27852721, 8712661690(వాట్సప్) నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ- చలాన్ యాప్ లో కాకపోతే.. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్, నెట్‌బ్యాంకింగ్ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.