వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
X
వరంగల్ జిల్లాలో (Warangal) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం (Wardhannapet) ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ (Lorry Hits Auto) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఆటోను లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 8 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు ప్రయాణీకులు ఆటోలో ఇరుక్కుపోయారు. వీరిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున ఓ లారీ డ్రైవర్ ఫుల్లుగా మద్యం సేవించి.. రాంగ్ రూట్‌లో వచ్చి ఆటోను ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఫూటుగా మద్యం సేవించి, రాంగ్ రూట్‌లో లారీని నడపడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాలన్నీ ఆటోలోనే చిక్కుకుపోయాయి. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురు కాపాడాలంటూ స్థానికుల్ని వేడుకోవడం కలిచి వేసింది.
ప్రమాదంపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు తేనె విక్రయించే కూలీలుగా గుర్తించారు. తేనె సేకరించి కూడళ్ళలో వాటిని విక్రయిస్తుంటారు. మద్యం మత్తులో లారీ నడపడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. డ్రంక్ డ్రైవ్ ప్రమాదకరమని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరికి మాత్రం అస్సలు పట్టడం లేదు. తాగేసి డ్రైవింగ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.