బీఆర్ఎస్లో టికెట్ల లొల్లి.. సెల్ టవరెక్కిన బీఆర్ఎస్ కార్యకర్తలు
X
ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించక ముందే బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పి మొదలైంది. సోమవారం ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో నాయకుల అనుచరుల్లో అలజడి మొదలైంది. అభిమాన నేతలకు టికెట్ దక్కకపోవచ్చన్న అనుమానంతో కొందరు కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికే జనగామ, స్టేషన్ ఘన్ పూర్ లో టికెట్ల లొల్లి జరుగుతుండగా.. తాజాగా భూపాలపల్లిలోనూ అగ్గి రాజుకుంది.
భూపాలపల్లి టికెట్ను మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు రోడ్డెక్కారు. రావాలి మదన్న.. కావాలి మధన్న అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అయినా బీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు.
మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలంటూ ముగ్గురు కార్యకర్తలు ఏకంగా సెల్ టవర్ ఎక్కారు. అధిష్టానం మధుసూదనాచారికి టికెట్ ప్రకటించేంత వరకు టవర్ దిగే ప్రసక్తే లేదని శ్రీకాంత్, పూర్ణచందర్, పృథ్వి అనే ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలు భీష్మించారు. ఉద్యమకారుడైన మధుసూదనాచారిని కాదని గండ్ర వెంకట రమణారెడ్డికి టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.