KCR : బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు
X
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై శుక్రవారం చర్చ జరగ్గా బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన సభకు హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ఇటీవల అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు.
అయితే, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి కానీ, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ రాలేదు. ఈరోజు బడ్జెట్ సందర్భంగానైనా ఆయన వస్తారని భావించినప్పటికీ... ఆయన రావడం లేదనే సమాచారం అందింది. ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన రెండోరోజు కూడా సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. తొలిరోజు అమావాస్య కావడంతో హాజరుకాలేదని భావించగా.. మర్నాడు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాట్లపై కీలక నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం బంజారాహిల్స్ లోని నంది నగర్ లో ఉన్న తన నివాసంలోనే ఉన్నారు.