Breaking News : హాస్పిటల్‌లో చేరిన మాజీ సీఎం కేసీఆర్.. విరిగిన తుంటి ఎముక
X
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్ధరాత్రి యశోదా ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ కాలి తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాల్సి రావొచ్చని, వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఈ విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. అర్థరాత్రి ఎడమ కాలికి పంచె తగలడంతో… బాత్రూమ్ లో కాలు జారి పడినట్లు కొందరు చెబుతున్నారు. రాత్రి కొన్ని టెస్టులు చేసిన డాక్టర్లు, ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత మరిన్ని టెస్టులు చేస్తారని తెలిసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఓటమి తర్వాత బీఆర్ఎస్ తరఫున గెలిచిన నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకున్నారు. ప్రతిపక్ష పాత్రను ఎలా సమర్థవంతంగా నిర్వర్తించాలో అన్న అంశంపై కూడా చర్చించారు. కానీ ఇంతలోనే కేసీఆర్ కు గాయాలవడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.