Somesh Kumar IAS: ఏటా లక్షల్లో రైతు బంధు తీసుకున్న సోమేశ్ కుమార్
X
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎస్‌గా ఉన్న సమయంలో సోమేశ్ కుమార్.. రంగారెడ్డి జిల్లా యాచారంలో అక్రమంగా భూముల కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటవుతుందని ముందే గ్రహించి పక్కా ప్లాన్ ప్రకారం 2018లోనే ఆ భూములను కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. అలా అక్రమంగా కొనుగోలు చేసిన భూముల ద్వారా డీఓపీటీ (Department of Personnel and Training) అనుమతి లేకపోయినా రూ.లక్షల్లో రైతుబంధు సొమ్ములను తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొత్తపల్లి విలేజ్ లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు రైతుబంధు 14 లక్షలు తీసుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉండగా.. దానికి సైతం సోమేష్ కుమార్ రైతు బంధు పొందినట్లు గుర్తించారు. ప్రతి ఆరు నెలలకు రూ.1,27,375 చొప్పున సోమేశ్ కుమార్ రైతుబంధు తీసుకున్నారని తెలిసింది. అలా సంవత్సరానికి రూ.2,52,750 రూపాయల రైతుబంధు సోమేశ్ కుమార్ తీసుకున్నారు. మరోవైపు, సీఎస్ సోమేష్ కుమార్ భూముల కొనుగోలు పైన కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు డీవోపీటీ నుంచి సోమేశ్ కుమార్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని సమాచారం.