DSP Nalini : సీఎం గారూ.. మీ అభిమానానికి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.. నళిని ఎమోషనల్..
X
డీఎస్పీ నళిని.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పేరు తెలియని వారుండరు. తెలంగాణ కోసం ఆమె ఉద్యోగానికే రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆమెను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నళిని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నళినికి ఉద్యోగం విషయంపై అధికారులతో సీఎం రేవంత్ స్పందించారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి వుంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. అయితే రేవంత్ ఆఫర్పై నళిని స్పందించారు.
‘‘సీఎం రేవంత్ రెడ్డి నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మాను మోశాను. నన్ను అప్పటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు.. 2009
డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా సంచలనం రేకెత్తించింది. నాటి సీఎం రోశయ్య మహిళా దినోత్సవం నాడు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే.. నేను రాజీనామాను విత్ డ్రా చేసుకున్నాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి’’ అని నళిని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
‘‘అంతిమంగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే.. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుంచి చక్కని పాలన ఆశించొచ్చు అనిపిస్తుంది. మీరు నాకు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’’ అని నళిని తెలిపింది. త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తాను అని చెప్పింది.