షర్మిల అన్న వదిలేసిన బాణం: ఆదినారాయణ రెడ్డి
X
షర్మిల అన్న వదలిన బాణం కాదు.. అన్న వదిలేసిన బాణమని మంత్రి ఆదినారాయణ రెడ్డి సెటైర్లు వేశారు. త్వరలో షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే జగన్ పని అయిపోయినట్లే అన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని స్పష్టమైన సమాచారం ఉందని వివరించారు. జగన్ రెడ్డి పోలవరానికి పొగపెట్టి.. అమరావతికి అగ్గిపెట్టారని విమర్శించారు. కేంద్రం ఏపీకి 35 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కనీసం 35 ఇళ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం ఏంటో సెప్టెంబర్ తర్వాత తెలుస్తుందని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.
వైఎస్ఆర్టీపీ పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో రాణించలేమనే ఆలోచనకు వచ్చిన షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్ చొరవ తీసుకుని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడించినట్టు సమాచారం. ఏపీలో షర్మిలతో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందంట. అయితే షర్మిల మాత్రం తెలంగాణవైపు మొగ్గుచూపడం ఆసక్తిరేపుతోంది.