Home > తెలంగాణ > మిషన్ భగీరథలోనూ లాభం వెతుకుతున్నారంటే.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు పంచ్‌లు

మిషన్ భగీరథలోనూ లాభం వెతుకుతున్నారంటే.. సీఎం రేవంత్‌పై హరీష్ రావు పంచ్‌లు

మిషన్ భగీరథలోనూ లాభం వెతుకుతున్నారంటే..  సీఎం రేవంత్‌పై హరీష్ రావు పంచ్‌లు
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ, మంచినీరు, ప్రజారోగ్యం, కాళేశ్వరం లాంటి అంశాలపై వివరంగా స్పందిస్తూ రేవంత్ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరం. ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చింది. దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వంద శాతం ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడం సాధ్యమయింది. ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి, ఈ మిషన్ భగీరథ దండుగ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయం’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘మిషన్ భగీరథ కోసం మా ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని రూ. 50 వేల కోట్లకు పెంచి చెబుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. మిషన్ భగీరథ ద్వారా ఏం లాభం తెచ్చారని, దానికి తెచ్చిన అప్పుకు వడ్డీ ఎలా కడుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన, భావ దారిద్ర్యమైన ఆరోపణ ఇంకోటి ఉండదు. అసలు మిషన్ భగీరథ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏమిటి? అనే విషయాలపై కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సౌకర్యం కలిగిన జనావాసాల సంఖ్య కేవలం 5,672 అయితే, 2023 పూర్తయ్యే నాటికి 23,930 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందుతున్నాయి. 2014కు ముందు కేవలం 30 శాతం ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా మంచినీటి సౌకర్యం ఉండేది. అదిప్పుడు వంద శాతానికి చేరుకుంది’’ హరీశ్ రావు గుర్తు చేశారు.

‘‘ఇక మాట్లాడితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ, ఫలితం లేదని విమర్శిస్తున్నారు. ప్రాణహిత- చేవెళ్లను కాదని కాళేశ్వరం కట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మేము అసెంబ్లీలో చాలా స్పష్టంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా వివరించాం. అయినా అవే విమర్శలు చేయడం తగదు. 2007లో ప్రాణహిత- చేవెళ్లకు శంఖుస్థాపన చేసి, 2014 వరకు అంటే ఏడేళ్లు ఏ పనీ చేయకుండా ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారు అంటే సమాధానం ఉండదు. 2014తో పోలిస్తే 2023 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా చెబితే అది చెవికెక్కదు. 1956 నుండి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తే, గడిచిన తొమ్మిదిన్నరెళ్ళలోనే మా ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిందని లెక్కలు, ఆధారాలతో సహా చెప్పినా వీరికి అవగాహన కలగడం లేదు" అని మండిపడ్డారు. బీడుబడ్డ భూముల్లో సిరులు పండుతుంటే రైతులు పడే సంతోషం చూడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వంతో లాభ నష్టాలు చూడవద్దని కోరుతున్నట్లు చెప్పారు.

రైతులకు సాగునీరు ఇవ్వడాన్ని, ప్రజలకు మంచినీరు ఇవ్వడాన్ని కూడా లాభనష్టాలతో బేరేజు వేసుకునే ప్రభుత్వం ఒకటి వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరన్నారు. ఆసరా పెన్షన్ల ద్వారా కూడా వేల కోట్లు ఖర్చు అవుతుంది. దాని వల్ల లాభం లేదంటారా? అని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన హామీలే మీకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. ముందు ఆ హామీల గురించి మాట్లాడాలని హితవు పలికారు. చివరిగా ఒక మాట.. రేవంత్ రెడ్డి ప్రతి సారి నా ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తున్నారు. నేను కూడా మీ ఎత్తు గురించి మాట్లాడితే సంస్కారవంతంగా ఉండదు. ఎవరెత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదు. ప్రజలకోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో, ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే వారికి అవసరమన్నారు.

Updated : 27 Feb 2024 6:09 PM IST
Tags:    
Next Story
Share it
Top