బీసీ కులగణనతో నష్టపోయేది బీసీలే - Gangula Kamalakar
X
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుల గణన తీర్మానాన్ని బీఆర్ఎస్ స్వాగతిస్తుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కానీ లోక్ సభ ఎన్నికలకు ముందు తీర్మానం ప్రవేశపెట్టడంపై అనుమానం వ్యక్తంచేశారు. తమ సందేహాలను తీర్చడంతో పాటు అన్నీ వర్గాల సర్వే చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వాలని కోరారు. కులగణన ప్రకారం తమకు రాజ్యాధికారం కావాలని, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ లో కుల గణన తీర్మానంపై చర్చలో భాగంగా గంగుల మాట్లాడారు.
కుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని గంగుల ప్రభుత్వానికి సూచించారు. కుల గణనపై తీర్మానం కాకుండా చట్టం చేస్తే బాగుంటుందని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కుల గణన చట్టం ఉండాలని, కోర్టు కేసులకు అవకాశం లేకుండా చూడాలని చెప్పారు. కుల గణన పూర్తైన వెంటనే చట్టం చేస్తే బాగుంటుందని గంగుల అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆయన.. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం మించిపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు.
చట్టసభల్లో 50 శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని ఆశిస్తున్నామని గంగుల చెప్పారు. ఎంబీసీలను తొలిసారిగా గుర్తించిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కే దక్కుతందని అన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని, బీసీ సబ్ ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో కుల గణనకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను ఈ సందర్భంగా గంగుల సభలో ప్రస్తావించారు.