Koppula Eshwar:నిరాధార ఆరోపణలు చేయడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య.. Koppula Eshwar
X
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి, రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. BJP, BRS కుమ్మక్కయ్యారని నిరాధార ఆరోపణలు చేస్తూ.. బీఆర్ఎస్ ను బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇదంతా పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమేనని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో... ప్రముఖులపై నిరాధార ఆరోపణలు చేసి, బురద జల్లే పని రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య అని కొప్పుల అన్నారు. తమ పార్టీ అగ్రనాయకులైన కేటీఆర్, హరీష్ రావులను.. బిల్లా,రంగాలతో రేవంత్ పోల్చడం దారుణమని.. దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. హంతకులతో తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడ్డ నేతలను పోల్చడం సీఎం పోస్టు లో ఉన్న వ్యక్తి కి చెల్లుతుందా అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ లో వేసినట్టే అని సీఎం అనడం ఓటర్లను అవమానించడమేనన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని అహంకారం తగదన్నారు. దేశంలో కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని ..దీనికే అంత మిడిసి పాటు ఎందుకని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి యాభై రోజుల పైనే అయిందన్న కొప్పుల ఈశ్వర్.. ఎన్నికల ముందు వంద రోజుల్లో గ్యారంటీల అమలు అని.. ఇప్పుడేమో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అమలు అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు ఆందోళనతో ఉన్నారని, వారి భాధలు ముఖ్యమంత్రికి పట్టడం లేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సీఎం రేవంత్ అంగీకరిస్తేనే.. కేంద్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చిందన్నారు. కేసీఆర్ తన హయాంలో రైతుల శ్రేయస్సు కోసం మీటర్లు బిగించే ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు. ప్రధాని మోడీ ని కేసీఆర్ ప్రశ్నించినంతగా ఎవరూ ప్రశ్నించలేదన్నారు.
తెలంగాణ ఉద్యమ కారులను బీ ఆర్ ఎస్ గౌరవించిందని, అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నదన్నారు . మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలన్నారు కొప్పుల. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఈ ప్రభుత్వం పంటలకు విడుదల చేయక ఎండబెడుతున్నారన్నారు. కేసీఆర్ ను బద్నామ్ చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టు గా చూపే ప్రయత్నం చేస్తున్నారని.. సీఎం ,మంత్రులకు పాలన చేత కాక అనవసర విషయాలు తెర పైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇక నైనా పాలన మీద దృష్టి పెట్టి ఇచ్చిన హామీల అమలు కోసం కృషి చేయాలని సూచించారు కొప్పుల.