మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X
అదృష్టం.. కష్టపడ్డా.. పని చేసినా.. సక్సెస్ అయిన.. పాలమ్మినా.. పూలమ్మినా.. ’’ ఈ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ డైలాగ్‌కు స్పూఫులు, మీమ్స్ చాలానే పుట్టుకొచ్చాయి. ఇక, అసలు విషయానికి వస్తే..మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ ఎన్నికల్లోను పోటీ చేయనని ఆయన తెలిపారు. తనకు 71 సంవత్సరాలు వచ్చినందున పోటీకి దూరంగా ఉంటానని తెలిపారు. ఈ ఐదేళ్లు ప్రజల కోసం సేవ చేస్తానని హామి ఇచ్చారు. మేడ్చల్‌లో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మల్లారెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అధిష్టానం ఛాన్స్ ఇస్తే పోటీకి సై అంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తాను పార్లమెంట్ కు వెళ్లడం ద్వారా ఎమ్మెల్యేగా ఖాళీ కాబోయే స్థానంలో తన కొడుకును గెలిపించుకుని రాజకీయంగా సెటిల్ చేయాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇవే తన చివరి ఎన్నికలు అని పరోక్షంగా పార్టీకి హింట్ ఇస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మల్లారెడ్డి వ్యూహం ఎలా ఉన్నా గులాబీ అధినేత కేసీఆర్ ఆలోచన ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది.