Singireddy Niranjan Reddy: వైఎస్ రాఖశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్న పార్టీ.. మీరు ఓ లెక్క కాదు
X
గత పదేళ్లలో కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ది చేస్తే... అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అనాలోచితంగా తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు దెబ్బకొట్టిందన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy). కేఆర్ఎంబీకి రేవంత్ సర్కార్ ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు అప్పజెప్పడం తెలంగాణ జీవన్మరణ సమస్యకు దారితీస్తుందన్నారు. కేంద్రానికి ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు ఇవ్వడం అంటే ఆంధ్రా ప్రయోజనాలు నెరవేర్చడమేనన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను పోరాడి తెచ్చుకున్నదే సాగు నీళ్ల కోసమని, కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో రాజీ పడలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రయోజనాలను వెండి పళ్లెంలో కేంద్రానికి అప్పగించిందంటూ ఆరోపించారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని అన్నారు. జనవరి 17న జరిగిన కేంద్ర ప్రభుత్వ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి అంగీకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర తప్పిదం చేసిందని అన్నారు. తెలంగాణలో ప్రతి గడపగడపకూ ఈ విషయాన్ని తీసుకెళ్తామని అన్నారు. కేఆర్ఎంబీ(KRMB)కి ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు అప్పజెప్పడం తెలంగాణ జీవన్మరణ సమస్యకు దారి తీస్తోందని అన్నారు. ఆరు నెలలలో తెలంగాణ నీటి వాటాల గురించి ప్రభుత్వం తేల్చి చెప్పాలని అంత వరకూ విశ్రమించేది లేదని అన్నారు. నల్లగొండ సభ నుంచే ఉద్యమ శంఖారావాన్ని పూరిస్తామని అన్నారు.
ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరీ మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయిందని అన్నారు. కనీసం ఇంత పెద్ద నిర్ణయం గురించి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షానికి చెప్పకపోవడం దారణమని అన్నారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని, తెలంగాణ హక్కు(Fight for Telangana Rights) తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అనేక కేంద్రప్రభుత్వ, కేఆర్ఎంబీ సమావేశాల్లో ఎప్పుడూ కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబీ పరిధిలోకి అంగీకరించలేదన్నారు. "ఇటీవలి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించింది .. ఆ విషయం స్పష్టంగా మినిట్స్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేదో ప్రైవేటు ఒప్పందంలా మాట్లాడుతున్నది. ఈ నెల 13న నల్లగొండ బహిరంగ సభ(Nalgonda Sabha)ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. నల్లగొండ సభకు ఆంక్షలు విధిస్తే కోర్టును ఆశ్రయిస్తాం .. ఆంక్షలతో సభను అడ్డుకోలేరు. వైఎస్ రాఖశేఖర్ రెడ్డి లాంటి మహామహులను ఎదుర్కొన్న పార్టీ మాది, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ లెక్క కాదు అని నిరంజన్ రెడ్డి అన్నారు.