రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది..Srinivas Goud
X
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అసలు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయని తెలిపారు. గతంలో ముంబైకి బస్సులు వేయాలని ధర్నాలు చేసే వారని.. కానీ పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ధర్నా జరగలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలమూరు అభివృద్ధి పై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అసలు అభివృద్ధే జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ హాయంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కల్వకుర్తి లిఫ్ట్ పథకంతో నీళ్లు ఇవ్వలేదా ఆత్మ సాక్షిగా చెప్పండని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్క ఓటమిపై ఇన్ని అభాండాలా అన్నారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నారు గనుకే తెలంగాణ ఏర్పడిందన్నారు.
తెలంగాణ వాదాన్ని కప్పి పుచ్చుకునేందుకు శిలా ఫలకాలు వేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకున్నపుడు అభివృద్ధి జరిగిందా..కేసీఆర్ హయంలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని తేల్చి చెప్పారు. జిల్లా నుంచి సీఎం అయినందుకు జిల్లా అభివృద్ధి పై దృష్టి పెట్టండని సూచించారు. కాళేశ్వరం పరిశీలించిన మీరు....పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించండని తెలిపారు. అప్పుడు బీఆర్ఎస్ నాయకులు కుడా వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. కొడంగల్ ఎత్తి పోతలపై పునరాలోచించండని సూచించిన ఆయన..జూరాల నుంచి నీటి తరలింపు సాధ్యమేనా అని ప్రశ్నించారు.
పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి 15 శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని.. వాటిని నాలుగైదు నెలల్లో పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఇంజనీర్స్ తో సమీక్షించి..అప్పుడు నీళ్లు ఇచ్చిన ఘనత మాదే అని చెప్పుకోండని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముసళ్ళ పండగేనని...బీఆర్ఎస్ ఎంతో చేసినా ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకున్నారని తెలిపారు. ఇంకా ఎక్కువ కోరుకున్నారు కాబట్టే..కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని తెలిపారు. రెండు జాతీయ పార్టీలకే పొత్తు అవసరమని..పాలమూరులో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి పొత్తు అవసరం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.