Home > తెలంగాణ > తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం.. రేణుకా చౌదరి

తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం.. రేణుకా చౌదరి

తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం.. రేణుకా చౌదరి
X

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిని చూపుతున్నవారికి స్వాగతం పలుకుతామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు అభివృద్ధి చేశారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మంచి నాయకుడని ఆమె కితాబునిచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సగం మంది ఫోర్​ ట్వంటీలేనని ఆమె ఆరోపించారు. బుధవారం కొత్తగూడెం క్లబ్​లో నిర్వహించిన ప్రజా చైతన్య సభలో మాట్లాడుతూ.. మాయ మాటలతో మోసం చేస్తున్న సీఎం కేసీఆర్​కు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేసీఆర్​ప్రత్యేక నిఘా పెట్టారని విమర్శించారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్​ ప్రభుత్వాలేనన్నారు. కొత్తగూడెంలో ఒంటరిగా ఆడమనిషి తన సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందన్నారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నారన్నారు. అన్నం పెట్టిన తల్లి లాంటి కాంగ్రెస్​ను మోసం చేసిన ఘనత ఎమ్మెల్యే వనమాకే దక్కుతుందన్నారు.





ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్టు దక్కలేదు. పాలేరు నుండి బరిలోకి దిగాలని తుమ్మల నాగేశ్వరరావు భావించారు. అయితే పాలేరు బీఆర్ఎస్ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే ఆ పార్టీ కేటాయించింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తితో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీల్లో చేరాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారు. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు నిన్న సమావేశమయ్యారు. పాలేరు టిక్కెట్టు ఇవ్వకుండా తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ నాయకత్వం అవమానించిందని వారు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడాలని తుమ్మల నాగేశ్వరరావుపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు.




Updated : 24 Aug 2023 12:18 PM IST
Tags:    
Next Story
Share it
Top