మృతుల్లో 4 రోజుల చిన్నారి.. నాంపల్లి ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
X
నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
ఇదిలా ఉంటే నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. చనిపోయినవారిలో 4 రోజుల వయసున్న పసికందు ఉండటం స్థానికులను కంటతడి పెట్టించింది. అపార్టుమెంట్ వద్ద ఎన్డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు, పొగ కారణంగా అస్వస్థతకు గురైన వారినీ దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి అపార్ట్ మెంటులో చిక్కుకున్న 21 మంది బయటకు తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని అన్నారు.
కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు డీసీపీ వెల్లడించారు. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజీ ఉందని, అందులోని డ్రమ్మల్లో డీజిల్, కెమికల్స్ నిల్వ చేసినట్లు చెప్పారు. వాటి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించాయని అన్నారు. అపార్ట్మెంట్ 3, 4 ఫోర్లలో అద్దెకు ఉంటున్నారని పొగ కారణంగా ఊపిరాడక కొందరు చనిపోయినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.