Home > తెలంగాణ > Free Bus Scheme: కంటతడి పెట్టుకున్న TSRTC కండక్టర్

Free Bus Scheme: కంటతడి పెట్టుకున్న TSRTC కండక్టర్

Free Bus Scheme: కంటతడి పెట్టుకున్న TSRTC కండక్టర్
X

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన వస్తోంది. దీని కారణంగా బస్టాండ్లు, బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణం ఉచితం కావడంతో.. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందైనా ఆర్టీసీ బస్సులనే ఎంచుకుంటున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు.. మహిళా ప్రయాణికుల ప్రవర్తనతో విసిగిపోతున్నారు. ప్రభుత్వం పద్ధతిగా చెప్పినా కూడా.. ఆధార్ కార్డు ఒరిజినల్ కాకుండా జిరాక్సులు, స్మార్ట్‌ఫోన్లలో ఫోటోలు చూపించడం వంటివి చేస్తూ.. వారి ఓపికను పరీక్షిస్తున్నారు. తాజాగా ఓ మహిళ కండక్టర్ ప్రయాణికులు కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దారి మధ్యలోనే​ బస్సును ఆపేశారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది.

భద్రాచలం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో మహిళలు కిక్కిరిసిపోయేవిధంగా ఎక్కారు. ఆ బస్సులో కనీసం నిల్చొని వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. డోర్ దగ్గర ప్రమాదకర రీతిలో నిల్చున్న మహిళలను బస్సు కండక్టర్ లోపలికి రమ్మని పిలవడంతో.. ఆ బస్సులో ఉన్న మహిళలు కండక్టర్ నే దించేశారు. దీంతో ఆ మహిళా కండక్టర్ బూర్గంపాడులో అర్ధాంతరంగా ఆ పల్లెవెలుగు బస్సును నిలిపివేసింది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పరిమితికి మించి మహిళలు బస్సు ఎక్కి కనీసం కండక్టర్ ను కూడా బస్సు ఎక్కనీయకుండా చేస్తున్నారని ఆమె వాపోయింది. బస్సు డోర్​ దగ్గర ఉన్న ప్రయాణికులను జరగాలని రిక్వెస్ట్​ చేసినా తనకు చోటు ఇవ్వలేదని చెప్పింది. ప్రభుత్వం ఉచిత బస్సు కల్పించిందని, తమకు కండక్టర్​ అవసరం లేదంటూ ప్రయాణికులు తనతో ప్రవర్తించారని తెలిపింది. దీంతో గౌతమిపురం స్టేజీ వద్ద బస్సు ఆపించి, ఉద్యోగం చేయలేనంటూ కన్నీరు పెట్టుకుంది. మహిళ ప్రయాణికులు తనతో దుర్భాషలాడుతున్నారని కన్నీటిపర్యంతమయ్యింది.

డ్రైవర్‌పై దాడి..

ఇదిలా ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. నిన్న ఖమ్మం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు కొత్తగూడెం పోస్టాఫీస్ వద్దకు చేరుకుంది. అప్పటివరకూ ఆటోల్లో వెళ్దామనుకున్న ప్రయాణికులంతా బస్సు ఎక్కారు. దీంతో నలుగురు ఆటో డ్రైవర్లు ఆగ్రహంతో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడి చేశారు. కండక్టర్, ప్రయాణికులకు వారించినా ఆగలేదు. అసభ్య పదజాలంతో దూషించారు.

Updated : 28 Dec 2023 7:41 AM IST
Tags:    
Next Story
Share it
Top