Gaddar Last Movie : గద్దర్ ఆఖరి సినిమా త్వరలో విడుదల
X
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన గొంతు మూగబోయింది. 77 ఏళ్ల వయసులో ప్రజా యుద్ధనౌక అస్తమించింది. ప్రజా గాయకుడిగా తెలంగాణ ప్రజలకు గద్దర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన బాట, పాట భావితరాల గుండెల్లో ఆశాదీపంగా అజరామరంగా నిలుస్తుంది. గద్దర్ మరణంతో తెలుగు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. గద్దర్ ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని.. ప్రపంచ వ్యప్తంగా ప్రభావం చూపిన యోధుడని ఆయన్ని గుర్తుచేసుకుంటూ కొనియాడుతున్నారు. గద్దర్ ప్రజల గాయకుడు మాత్రమే కాదు, ఆయన కొన్ని చిత్రాల్లోనూ నటించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. గద్దర్ లో రచయిత, గాయకుడు మాత్రమే కాదు , మంచి నటుడు ఉన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాదు తన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర కీలక పాత్రను పోషించారు. 'అమ్మ తెలంగాణమా', 'పొడుస్తున్న పొద్దుమీద' వంటి పాటలను చిత్రాల్లో పాడి తెలంగాణ ఉద్యమానికి మరింత ఊపిరి పోశారు. గతంలో 'మా భూమి' అనే సినిమాలో 'బండి వెనుక బండికట్టి...' అనే ఫేమస్ సాంగ్‌తో గద్దర సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. పీపుల్స్ స్టార్ అయిన ఆర్. నారాయణ మూర్తి నటించిన కొన్ని చిత్రాలకు గద్దర్ పాటలు రాశారు. ఇక 'ఒరేయ్ రిక్షా' అనే సినిమాలో ఆయన రాసిన 'మల్లెతీగకు పందిరి వోలే...' పాట ఆల్ టైం రికార్డ్ పాటగా నిలుస్తుంది.
'గద్దర్' ఈ మధ్యే ఓ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ క్రమంలోనే ఆయన మరణించడంతో ఇదే ఆయన ఆఖరి చిత్రం అయ్యింది. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందించిన ఉక్కు సత్యాగ్రహం మూవీలో గద్దర కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాకు ప్రొడ్యూజర్‌గా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తున్నాడు. పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ హీరోయిన్గా పరిచయం అవుతోంది. స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్లు, ఉద్యోగులు, నిర్వాసితులు ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం. గద్దర్‌తో పాటు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ వంటి ప్రముఖులు ఈ సినిమాకు పాటలు రాశారు.
సినిమా విడుదల కాకముందే గద్దర్ మరణించడంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. సత్యారెడ్డి గద్దర్‌కు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు . "' మా సినిమాలో గద్దర్ గారు కీలక పాత్రను పోషించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. దాదాపుగా సినిమా డబ్బింగ్ పనులు పూర్తి కావస్తున్నాయి. ఈ మధ్యనే రీ రికార్డింగ్ పనుల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతలోనే ఆయన మరణ వార్త విన్నాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా టీమ్ తరఫున కోరుకుంటున్నాను" అని సత్యారెడ్డి చెప్పారు.