ముగిసిన గద్దర్ అంత్యక్రియలు.. అధికార లాంఛనాలతో..
X
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అల్వాల్లోని మహాభోది స్కూల్ గ్రౌండ్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. బౌద్ధమత సంప్రదాయాల ప్రకారం ఈ అంత్యక్రియలను నిర్వహించారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా తరలివచ్చారు. ఆ జనసందోహాన్ని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు.
అంతుకుముందు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ ఇంటి వరకు అంతిమయాత్ర సాగింది. అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య గద్దర్ ఇంటి వరకు అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో గద్దర్ పాటలు పాడుతూ కళాకారులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇంటి వద్ద సీఎం కేసీఆర్ గద్దర్కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత అల్వాల్లోని మహాభోది స్కూల్ గ్రౌండ్లో అంత్యక్రియలు నిర్వహించారు.
పోలీసు తుపాకే సెల్యూట్ కొట్టింది..
బహుశా దేశ చరిత్రలోనే ఇలాంటి అంత్యక్రియలు ఎవరికీ జరిగి ఉండవు. 40 ఏళ్లకుపై ప్రభుత్వాల దమనకాండకు వ్యతిరేకంగా గొంతు విప్పి, హాహా హూహూ అంటూ సింహగర్జనతో నిప్పులు చెరిగిన గద్దర్‌కు చివరికి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఆయనను మట్టుబెట్టడానికి ఒంట్లోకి తూటాలు పేల్చిన పోలీసుల తుపాకులే ఇప్పుడు ఆయనకు గౌరవవందనం సమర్పించాయి. ప్రజా ఉద్యమాలకు, తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి తన ఆటపాటలతో అసమాన సేవలు అందించినందుకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.