1969 ఉద్యమానికి ఊపు తెచ్చిన గద్దర్
X
గద్దర్.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉద్యమకారులకి ఆయనో స్ఫూర్తి. ఆయన ఒక్క పిలుపుతో వేలాది మంది జనం రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన ఆట, పాటతో కీలక పాత్ర పోషించాడు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను ఎలుగెత్తి చాటాడు. ప్రజల పక్షాన నిలచి, వారి కష్టాలను తన గళంలో నింపి ఊరూరా వాడవాడలా పల్లవించి, ప్రభుత్వాలను దారికి తీసుకొచ్చిన గొప్ప కళాకారుడు గద్దర్.
ఇంజనీరింగ్ చేసి
1949లో మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ గ్రామంలో ఓ దళిత కుటుంబంలో గద్దర్ జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే కళా ప్రదర్శనలకు సంబంధించి శిక్షణ పొందారు. చిన్నతనంలోనే జిల్లా స్థాయి బుర్రకథల పోటీలలో ప్రథమ బహుమతి అందుకున్నారు. ప్రతి పంద్రాగస్టు, రిపబ్లిక్ డే తో పాటు ఇతర సందర్భాల్లో కళా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల సొంతూరు తూఫ్రాన్‌లో ‘బుర్రకథల విఠల్’గా పేరు తెచ్చుకున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కూలీగా పనిచేస్తూ వీలైనప్పుడు గుడిసెవాడలు, కార్మికవాడలలో ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఆనాటి పాలకవర్గాల ప్రలోభాలకు గురికాకుండా, అవకాశవాద సాంస్కృతిక సంస్థలలో భాగం కాకుండా, అణగారిన వర్గాల పక్షాన నిలిచారు గద్దర్.
ఉద్యమానికి కొత్త ఊపు
1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. చదువుకొనే రోజుల నుంచీ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని, వారి సమస్యలపై పాటలు, బుర్ర కథలతో ఎందరినో ఉత్సహపరిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన మాటలనే పాటలుగా మలిచి ఉద్యమానికి ఊపు తెచ్చారు. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటూనే చల్లా నర్సింహ బృందంతో కలిసి పాటలు, గొల్ల సుద్దులు పాడాడు. ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టై జైలు జీవితం గడిపారు. గ్రామీణ సమాజం, పట్టణ జీవితం, సామాజిక వైరుధ్యాలు, కుసంస్కృతిపై పోరాటానికి సంబంధించి గద్దర్ ఎన్నో రచనలు చేశారు. తెలుగులో నగర కార్మిక వర్గంపై గద్దర్ రాసినన్ని వైవిధ్యమైన పాటలు ఇంకెవరూ రాయలేదు.
అణగారిన వర్గాల కోసం
1972లో జననాట్యమండలి స్థాపనలో భాగమై ఆ సంస్థ పక్షాన సాంస్కృతికోద్యమ నిర్మాణానికి భాద్యతలు తీసుకోవడంతో గద్దర్ జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. బెంగాల్ లోని సుందర్‌బన్స్ నుంచి పంజాబ్ వరకు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు పర్యటించి అణగారిన వర్గాల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గద్దర్ పాటలు, కళారూపాలను ఆదివాసీ భాషలు సహా 15 నుంచి 20 భారతీయ భాషల్లోకి అనువదించారు. ఆయనపై 1997 ఏప్రిల్ 6న జరిగిన కాల్పులు, హత్యాయత్నానికి దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది.
ఎమర్జెన్సీ తర్వాత
గద్దర్ వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, ఆదివాసులు అణగారిన మహిళల జీవిత వాస్తవికతపై వందలాది పాటలు, కళారూపాలు, బ్యాలేలు రాశారు. ఎమర్జెన్సీ తర్వాత గద్దర్ సాహిత్య దృక్పథంలో మార్పు వచ్చింది. జననాట్యమండలి స్థాపనతో అందులో భాగమై గద్దర్ చేసిన రచనలతో ఇక్కడ ప్రగతిశీల సాహిత్యోద్యమం ప్రాణం పోసుకుంది. కెవిఆర్, గద్దర్, చెరబండరాజు, వరవరరావు భాగస్వాములుగా జాతీయస్థాయిలో ఏఐఎల్‌ఆర్‌సి స్థాపనతో ఆయా రాష్ట్రాల భాషల్లో గద్దర్ నిర్వహించిన సాహిత్య, సాంస్కృతిక ఉద్యమానికి ఒక స్థిరత్వం వచ్చింది.