గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం..
X
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాలేజీలో కొత్తగా చేరిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధించారు. దీనిపై బాధిత విద్యార్థులు కాలేజీ యాజమాన్యంతో పాటు ఢిల్లీ యూజీసీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఘటనపై విచారణ జరిపింది. 10 మంది సీనియర్లు ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించినట్లు తేలింది. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంది. 10 మందిని ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.
మెడికల్ కాలేజీ హాస్టల్ లో సీనియర్లు జూనియర్లను వేధించిన విషయాన్ని డీఎంఈ రమేష్ రెడ్డీ ధ్రువీకరించారు. 10 మందిని ఏడాది పాటు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్‌ను సహించేది లేదని స్పష్టం చేశారు.