Hyderabad: హైదరాబాద్లో జోరు వాన.. వర్షంలోనూ ఆగని శోభాయాత్ర..
X
హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. ( Heavy Rain) ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో జనం ఇబ్బందిపడగా... మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వాన పడింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్‌పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్‌మెట్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్‌మండి, బోయినపల్లి, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, ప్యారడైజ్, ఉప్పల్, మలక్‌పేట, అంబర్‌పేట, యూఓ క్యాంపస్‌తో పాటు పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. గంటకుపైగా ఏకధాటిగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై వర్షపు నీరు చేసింది. నిమజ్జనం కారణంగా సెలవు ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు అంతగా తలెత్తలేదు.
ఇదిలా ఉంటే నిమజ్జనం జరుగుతున్న హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. ( Ganesh Immersion) పెద్ద వర్షం కురిసినా గణేశ్ శోభాయాత్రకు ఎలాంటి అంతరాయం కలగలేదు. భక్తులు అంత వర్షంలోనూ డ్యాన్సులు చేస్తూ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. 10 రోజుల పాటు పూజలందుకున్న లంబోదరున్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఉత్సాహంగా వెళ్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద వానలోనే నిమజ్జనం కొనసాగుతోంది. ఇక ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ఇప్పటికే ముగిసింది.