హైదరాబాద్ వాసులకు శుభవార్త .. వాటిని పారేయకండి.. పైసలిస్తరు
X
రోజురోజుకి ప్లాస్టిక్ పెను భూతం అవుతోంది. రోజువారీ జీవితాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న వ్యర్థ ప్లాస్టిక్ సీసాలను కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ సీసాలను తీసుకొని.. బదులుగా డబ్బులిచ్చేలా ప్రత్యేకమైన యంత్రాలను ఏర్పాటు చేయబోతోంది. నగదు రూపంలో కాకుండా మొబైల్ వాలెట్లలో పైసలు జమ కానున్నాయి. అధునాతన సాంకేతికతతో పనిచేసే యంత్రాలు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నిత్యం 8 వేల టన్నుల చెత్త ఉత్పత్తి అయితే.. అందులో సుమారు పది శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే. మామూలు చెత్త నుంచి వీటిని వేరు చేస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో రీసైక్లింగ్‌కు ఉపయోగపడట్లేదని అధికారులు తెలిపారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ ను కట్టడి చేసేందుకు విదేశీ విధానాన్ని అనుసరిస్తోంది జీహెచ్ఎంసీ. బయటి దేశాల్లోని షాపింగ్ మాల్స్‌లో డ్రింకింగ్ వాటర్ , కూల్ డ్రింక్స్, ఇతరత్రా ప్లాస్టిక్ బాటిల్స్ ను 'రివర్స్ వెండింగ్ మిషన్లు' అనబడే యంత్రాల్లో వేస్తారు. వాటిలో వేస్తే.. వాటి బరువు ఆధారంగా డబ్బు వస్తుంది. ఫలితంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరుగుతూనే.. మరోవైపు ఔత్సాహికులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది.
అదే విధంగా.. మన హైదరాబాద్ లోని మొత్తం 3 ప్రాంతాల్లో రివర్స్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసి.. క్రమంగా వాటిని అన్ని రద్దీ ప్రాంతాలకు విస్తరించాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మొదట షేక్‌పేట దగ్గరున్న మల్కం చెరువు వద్ద, తర్వాత హైటెక్ సిటీలోని మరో రెండు చోట్ల ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు చెప్పారు. సమాంతరంగా ప్లాస్టిక్ కవర్ల తయారీ పరిశ్రమలపై చర్యలు, అవగాహన కార్యక్రమాలకు ప్రణాళిక జరుగుతోందని వారు వివరించారు.