హైఅలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ అధికారులు.. దయచేసి..!
X
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి కుండపోత వర్షం కురిసింది. గత రెండు రోజులుగా శాంతించిన వరుణుడు ఇవాళ (జులై 24) ఒక్కసారిగా విరుచుకు పడ్డాడు. దాంతో హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆఫీసుల నుంచి అంతా బయటికి వచ్చే సమయం కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి అల్లకల్లోలంగా మారింది. అంతేకాకుండా మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆల్వాల్, మాదాపూర్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, బోరబండ, వివేకానందనగర్, అల్లాపూర్, జగద్గిరిగుట్ట, కూకట్ పల్లి, పాతబస్తీ, ఉప్పల్, మల్కాజిగిరి, జవహర్ నగర్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, బేగంపేట్, పటాన్ చెరు, మియాపూర్, తార్నాక, మారేడ్పల్లి, కీసర, ఘట్కేసర్ సహా నగర శివారు వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. రాబోయే గంటలో సిటీ మొత్తం వానలు విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.