GHMC పారిశుద్ధ్య కార్మికురాలు నారాయణమ్మకు జాతీయ అవార్డు
X
బడికి పోలేదు, సంగీతం నేర్వలేదు.. అయితేనేం, ఆవిడ మట్టిలో మాణిక్యం. ఆమె సాహిత్య పాండిత్యం, జ్ఞాన సంపద ఓ అద్భుతం. ఆవిడ భక్తి పాట పాడినా, జానపద గీతం అందుకున్నా.. తోటి ఉద్యోగులు కష్టాల్ని మైమరచి, పనిలో లీనమైపోతారు. ఏమాత్రం అక్షర జ్ఞానం లేకున్నా.. భక్తి శ్లోకాలు, జానపద పాటలు పాడుతూ పేరు సంపాదించుకుంది. ఆవిడే నారాయణమ్మ. ఆవిడ పెద్ద సింగరేమి కాదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికురాలు. ఆమె ఇప్పుడు జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఫిల్మ్ నగర్ లోని బండారు బాల్ రెడ్డి నగర్కు చెందిన డి. నారాయణమ్మ.. జాతీయ కర్మచారి అవార్డుకు ఎంపిక చేశారు. జనవరి 24న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్రమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు.
పారిశుద్ధ్య కార్మికురాలిగా 22 ఏళ్లుగా బంజారాహిల్స్ రోడ్ నం.12 వెమిరెడ్డి ఎనక్లేవ్లో నారాయణమ్మ విధులు నిర్వహిస్తోంది. పని చేసుకుంటూ.. పాడిన ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఫోక్ స్టార్స్ (మైక్ టీవీ) యూట్యూబ్ చానెల్ నారాయణమ్మను ఇంటర్వ్యూ చేసి.. తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది. తర్వాత మైక్ టీవీ ప్రొడక్షన్స్ నుంచి విడుదలైన పలు పాటల్లో.. నారాయణమ్మకు అవకాశం ఇచ్చారు. అవి కాస్త యూట్యూబ్ లో బాగా పాపులర్ అవడంతో నారాయణమ్మ పేరు చాలామందికి తెలిసింది.