భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉద్ధృతి
X
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఆదివారం ఉదయానికి గోదావరి నీటిమట్టం 56 అడుగులు దాటింది. దీంతో దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ముంపు ప్రాంతాలకు చెందిన దాదాపు 10 వేల మంది గ్రామస్తులను 10కి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీటిని అధికారులు పెద్ద పెద్ద మోటర్ల ద్వారా గోదావరిలోకి మళ్లిస్తున్నారు.
వరదల కారణంగా భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, భద్రాచలం- చింతూరు మార్గాల్లో రాకపోకలను నిలిచిపోయాయి. బూర్గంపహాడ్ మండలంలోని సారపాక- నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్-వేలేరు, ఇరవెండి- అశ్వాపురం రహదారులపైకి గోదావరి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం చర్ల మండల కేంద్రానికి చేరుకుని పునరావాస కేంద్రాల్లో వరద బాధితులను పరామర్శించిన తర్వాత భద్రాచలం వెళ్లారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి మంత్రి పువ్వాడ కరకట్ట ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఎయిర్‌ఫోర్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి అవసరమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు.