Home > తెలంగాణ > రేపట్నుంచి బోనాలు ప్రారంభం.. గోల్కొండలో అమ్మకు తొలి బోనం

రేపట్నుంచి బోనాలు ప్రారంభం.. గోల్కొండలో అమ్మకు తొలి బోనం

రేపట్నుంచి బోనాలు ప్రారంభం.. గోల్కొండలో అమ్మకు తొలి బోనం
X

జంట నగరాల్లో బోనాల సందడి మొదలైంది. గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. రేపట్నుంచి నెల రోజుల పాటు ప్రతి గురు, ఆదివారాల్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆషాడమాసం పూర్తయ్యే వరకు ఆ రెండు రోజుల్లో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంప్రదాయం ప్రకారం గురువారం ఉదయం కుమ్మరి సంఘం, ఆలయ కమిటీ సంయుక్తంగా మొదటి బోనం సమర్పించనుంది.

లంగర్ హౌస్‌లో నుంచి నిర్వహించే గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు స‌మ‌ర్పిస్తారు. బోనాల నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆషాఢ మాసంలో గురు, ఆదివారాల్లో కోటలోకి వచ్చే వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదని అధికారులు ప్రకటించారు. బోనాల నేపథ్యంలో లంగర్​హౌస్​ చౌరస్తా నుంచి గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయం వరకు 600 మంది సిబ్బందితో బందోబస్తు ​ఏర్పాటు చేశారు. 90 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు.

గోల్కొండలో ఆదివారం రెండో బోనం అనంతరం జులై 9న లష్కర్లో బోనాలు జరగనున్నాయి. ఆ రోజున సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 10న రంగం ఉంటుంది. జులై 16న లాల్ దర్వాజలో బోనాలు సమర్పించనున్నారు. 17న రంగం, ఘటాల ఊరేగింపు జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది.





Updated : 21 Jun 2023 3:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top