Yadadri: ముందుకురాని దాతలు.. మొదలుకాని స్వర్ణ తాపడం పనులు
X
యాదాద్రీశుని ఆలయాన్ని అద్భుత రీతిలో పునర్నిర్మించిన కేసీఆర్ సర్కార్.. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత యాదాద్రి గర్భగుడిపై ఉండే విమాన గోపురానికి(తిరుమల తరహాలో) బంగారు తాపడం చేయించాలని భావించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా స్వయంగా ప్రస్తావించారు. 56 అడుగుల ఎత్తయిన ఈ విమాన గోపురానికి తనవంతుగా ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ క్రతువులో భక్తులు కూడా భాగం కావాలని పిలుపునివ్వగా.. పలువురు రాజకీయ నాయకులతోపాటు సామాన్య ప్రజలు సైతం విరాళాలు ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు స్వర్ణ తాపడానికి విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ స్వర్ణ తాపడం కోసం దాతల నుంచి కేవలం 8 కిలోల 257 గ్రాముల బంగారం, రూ. 23 కోట్ల మాత్రమే సమకూరింది. తాపడం కోసం రూ. 65 కోట్లు ఖర్చవుతుంది
అయితే ఆలయ ఉద్ఘాటన జరిగి ఏడాది అవుతున్న దాతలు మాత్రం ముందుకు రావడం లేదని ఆలయ అధికారులు అంటున్నారు. సాధారణ భక్తులతో పాటు నేతలు కూడా ఇంకా విరాళాలు ఇస్తూనే ఉన్నా.. స్వర్ణ తాపడానికి అవసరమైన బంగారం ఇంకా సమకూరలేదు. కేసీఆర్ పిలుపునకు మొదట్లో స్పందన బాగానే వచ్చినప్పటికీ.. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. విరాళం రూపంలో బంగారం రావడం ఆగిపోయింది. విరాళాలు ప్రకటించినవారు సైతం బంగారాన్ని ఆలయానికి అందజేయలేకపోయారు. ఫలితంగా తాపడం పనులు ఆలస్యమయ్యే పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా దాతలు ముందుకు వచ్చి దివ్య విమాన గోపురానికి బంగారం అందజేయాలనీ ఆలయ అధికారులు కోరుతున్నారు.