Home > తెలంగాణ > Good Conduct Prisoners: జనవరి 26 కోసం ఎదురుచూస్తున్న ఖైదీలు

Good Conduct Prisoners: జనవరి 26 కోసం ఎదురుచూస్తున్న ఖైదీలు

Good Conduct Prisoners: జనవరి 26 కోసం ఎదురుచూస్తున్న ఖైదీలు
X

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజావాణి'కి జనం ఫిర్యాదులతో వెల్లువగా వస్తున్న సంగతి తెలిసిందే. ఫిర్యాదుల్లో.. ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు, భూకబ్జాలు, డబుల్‌ బెడ్రూమ్‌ సమస్యలే కాకుండా మరికొన్నింటిని కూడా అధికారుల దృష్టికి తెస్తున్నారు. వాటిలో 'సత్ప్రవర్తన' గల ఖైదీల అంశం కూడా ఒకటి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన వారికి క్షమాభిక్ష పెట్టాలని పలువురు ఖైదీల కుటుంబీకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మామూలుగా స్వాతంత్య్ర దినోత్సవం(ఆగష్టు 15), గాంధీ జయంతి(అక్టోబర్ 2), రిపబ్లిక్ డే(జనవరి 26) వంటి వేడుకలొస్తే.. ఆ ప్రత్యేక దినాల్లో తమను విడుదల చేస్తారని ఖైదీలు ఆశపడుతుంటారు. సత్ప్రవర్తన కింద తమకు జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం లభిస్తుందని భావిస్తారు.

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భించాక ఈ పదేళ్లలో కేవలం రెండుసార్లు (2016, 2020) మాత్రమే ఖైదీలను విడుదల చేశారు. గత మూడేళ్లుగా సత్ప్రవర్తన ఖైదీల విడుదల లేకపోవడంతో ఈ గణతంత్ర దినోత్సవం నాడైనా రాష్ట్ర ప్రభుత్వం తమ కల నెరవేరుస్తుందని ఖైదీలు నిరీక్షిస్తున్నారు. ఇటీవల ప్రజావాణిలో కొందరు ఖైదీల కుటుంబాలు ఈ విషయమై విన్నవించుకున్న నేపథ్యంలో సత్ప్రవర్తన ఖైదీల జాబితా తయారీలో జైళ్లశాఖ నిమగ్నమైంది. 2020 సెప్టెంబరు 26న హోంశాఖ జారీ చేసిన జీవో నం.30నే ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆ ఏడాది గాంధీ జయంతిని పురస్కరించుకొని 141 మంది ఖైదీలు విడుదలయ్యారు. గతేడాది అక్టోబరులో గాంధీ జయంతి సందర్భంగా జైళ్లశాఖ నివేదిక రూపొందించి పంపించినా ప్రభుత్వపరంగా జీవో విడుదల కాలేదు. తాజా జాబితాలో సుమారు 250మంది వరకు ఖైదీలుండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.




Updated : 3 Jan 2024 7:44 AM IST
Tags:    
Next Story
Share it
Top