పండుగ వేళ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
X
మరో వారంలో దసరా వేడుకలు ప్రారంభమవుతున్న క్రమంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శాఖ శుభవార్త తెలిపింది. పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 621 సర్వీసులను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగ సెలవులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తీర్థయాత్రలు వెళ్లే వారికోసం కూడా పలు రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ నెలలో దక్షిణ మధ్య రైల్వే జోన్లో 208 సర్వీసులు అందుబాటులో ఉంటాయని, జోన్ నుంచి 139 సర్వీసులను ఆపరేట్ చేస్తామని, మరో 141 సర్వీసులు జోన్ వరకు చేరుకుంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ తెలిపారు.
వేరే జోన్లకు చెందిన మరో 133 ప్రత్యేక సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా వెళతాయన్నారు. మొత్తం 621 ప్రత్యేక సర్వీసులను దసరా పండుగ సందర్బంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచుతామని పేర్కొన్నారు. సాధారణ సర్వీసులకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. పండుగ వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్లాట్ఫారం టికెట్ ధరలను పెంచుతామన్నారు.