Home > తెలంగాణ > రైతులకు శుభవార్త..10 రోజుల్లో ఖాతాల్లో రైతు బంధు నగదు

రైతులకు శుభవార్త..10 రోజుల్లో ఖాతాల్లో రైతు బంధు నగదు

రైతులకు శుభవార్త..10 రోజుల్లో ఖాతాల్లో రైతు బంధు నగదు
X

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర సర్కార్ రైతులకు ఓ తీపి కబురు అందించింది. మరో పది రోజుల్లో రైతుల ఖాతాల్లో వానాకాలానికి సంబంధించి రైతు బంధు డబ్బులను జమ చేయాలని భావిస్తోంది. అందుకోసం రూ.7500 కోట్లు సమీకరించాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు కూడా ఈ ఏడాది చివర్లో జరుగనున్న నేపథ్యంలో,పథకాల అమలులో కూడా ప్రభుత్వం వేగాన్ని పెంచింది. ఇప్పటికే రెండో విడద గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలో పోడు భూములకు పట్టాలు కూడా పంపిణీ చేస్తామని ఈ మధ్యనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లాల వారీగా రైతుల లేటెస్టు డేటాను సేకరించి, ఆలస్యం కాకుండా వారి అకౌంట్లలో డబ్బు జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం.

ఖరీఫ్, రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతు బంధు డేటా అప్‌డేట్ అవుతుంటుంది. ప్రతి సీజన్‌లోనూ లబ్ధిదారుల తొలగింపు, చేరికలు జరుగుతుంటాయి. ఈ మధ్య సాగు భూములను కూడా చాలా మంది భూ యజమానులు ఇతర ప్రయోజనాల కోసం వ్యవసాయేతర భూములుగా మార్చుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సర్వే నంబర్ ఆధారంగానే డబ్బు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏటా రెండు సీజన్లకు గాను ప్రభుత్వం రైతు బంధు సాయం కింద ఎకరాకు రూ. 5 వేల చొప్పున అందిస్తోంది. గత ఖరీఫ్‌‎లో 63 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్దిపొందారు. రైతు బంధు కింద ప్రభుత్వం 7,400 కోట్లు పంపిణీ చేసింది.

ఈ వానాకాలం సీజన్‎లో ఈ పథకం కింద సుమారు 65 లక్షల మంది లబ్ధిపొందనున్నారు.7,500 కోట్లు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేస్తోంది. అదే విధంగా త్వరలోనే పోడు భూములకు పట్టాలను పంపిణీ చేయనుంది. పోడు వ్యవసాయం చేసే రైతులకు కూడా రైతుబంధు అందిస్తామని సీఎం ఇదివరకే ప్రకటించారు. దీంతో రైతు బంధుపై అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎంత లేదన్నా జూన్ 20 తర్వాతే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానున్నట్లు సమాచారం.

Updated : 12 Jun 2023 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top