తెలంగాణలోని పేదలకు శుభవార్త..నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు
X
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా సొంతిళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 3,500 మందికి గృహాలను మంజూరు చేయనుంది. ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు, స్థలం లేనివారికి స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కావడంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయనుంది. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కూడా సొంతిళ్లు లేని పేదలకు సర్కార్ శుభవార్త చెప్పింది.
సొంతిళ్లు లేని వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. అదేవిధంగా స్థలం ఉన్న వారికి ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సాయాన్ని అందించేందుకు కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు వెల్లడించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందే నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది. ఆ నిధులను కేంద్రం నుంచి అధిక మొత్తంలో రాబట్టి వాటితో ప్రజలకు మేలు జరిగేలా చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. ఆ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్ల కేటాయింపులు చేసినట్లుగా ప్రకటించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు గృహలక్ష్మి పథకం కింద ఇళ్లను నిర్మిస్తామని చెప్పింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అర్హుల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే ప్రభుత్వం మారడం వల్ల ఆ స్కీమ్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో నిజమైన అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.